అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 29న హైదరాబాద్ శిల్పకళా వేదికలో తానా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పది మంది ప్రముఖులను తానా ఈ వేదికపై సత్కరించనుంది.

అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకుడు డా. రామచంద్ర నాయుడు గల్లా, సుద్దాల అశోక్ తేజ (తానా అందెశ్రీ పురస్కారం), జమీలా నిషాత్, డా. సునీతా కృష్ణన్, జయధీర్ తిరుమలరావు, గడ్డం సమ్మయ్య, చింతకింది మల్లేశం, చింతల వెంకట్ రెడ్డి, దాసరి కొండప్ప తదితరులకు తానా పురస్కారాలు అందజేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి తెలిపారు.

తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో తానా 25వ మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వహించనున్న పురస్కారాల ప్రదానోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తానా ప్రతినిధులు తెలుగు ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నారు. హైదరాబాద్లో జరగనున్న ఈ వేడుకలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, తెలుగు సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొననున్నారు.















