ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలతో బిజీగా ఉంటారు. అయితే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ఓ వేదికపై తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పెళ్లికి ముందు తన సతీమణి గీతతో ప్రేమలో ఉన్న రోజుల్లో, తన మనసులోని ప్రేమ విషయాన్ని ఆమెకు నేరుగా చెప్పడం కోసం ఏకంగా హైదరాబాద్ నుంచి దిల్లీ వరకు బైక్‌పై ప్రయాణించిన విషయాన్ని సభాముఖంగా ప్రస్తావించారు.

వ్యాఖ్యాత అడిగిన ఈ ఊహించని ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా నవ్వుతూ బదులిచ్చారు. తన గతాన్ని గుర్తుచేసుకుంటూ, “1990లో ఎప్పుడో జరిగిన పాత విషయం ఇప్పుడెందుకులెండి?” అంటూ ఆయన తొలుత ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా సున్నితంగా దాటవేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, సీఎం ప్రేమకథ వెనుక ఉన్న ఆసక్తికర వివరాలను తెలుసుకోవాలని వ్యాఖ్యాత పట్టుబట్టారు.

హైదరాబాద్ నుంచి దిల్లీకి రానూపోనూ దాదాపు 3,200 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఉంటుంది కదా, అన్ని వేల కిలోమీటర్లు బైక్‌పై వెళ్లే అంతటి సాహసాన్ని ఆ రోజుల్లో ఎలా చేయగలిగారని వ్యాఖ్యాత నవ్వుతూ మరోసారి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం ముసిముసి నవ్వులు చిందిస్తూ, “ప్రేమలో ఉన్నప్పుడు వెయిట్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో.. ఆ బాధ ప్రేమలో ఉన్నవాళ్లకే తెలుస్తుంది. అది నా వ్యక్తిగత విషయం.. పబ్లిక్‌కు ఎందుకండి” అంటూ చమత్కారంగా సమాధానమిచ్చి అక్కడున్న వారిలో నవ్వులు పూయించారు.















