అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డీ బ్రార్ కోసం కెనడా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అతడి ఆచూకీ తెలిపి అరెస్టుకు దారితీసే సమాచారం అందించిన వారికి ఏకంగా 2.5 లక్షల కెనడియన్ డాలర్ల వరకు (సుమారు రూ.1.63 కోట్లు) రివార్డు ప్రకటించారు. కెనడాలో అత్యంత కీలకమైన 25 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో గోల్డీ బ్రార్ మొదటి స్థానంలో నిలిచాడు. నవంబర్ 19న టొరంటోలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోలో ప్రోగ్రామ్ తన తాజా మోస్ట్ వాంటెడ్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో గోల్డీ బ్రార్‌కు అగ్రస్థానం కేటాయించింది. కెనడా లేదా అమెరికాలో అతడి అరెస్టుకు దారితీసే సమాచారం అందించిన వారికి ఈ రివార్డు వర్తిస్తుందని ప్రకటించింది.

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా గోల్డీ బ్రార్ కోసం గాలిస్తోంది. 2026 సెప్టెంబర్ 28న అతడిని ఎఫ్‌బీఐ టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్ జాబితాలో చేర్చింది. అతడి అరెస్టుకు దారితీసే సమాచారం అందించిన వారికి 1 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు (సుమారు రూ.9 కోట్లకు పైగా) బహుమతి ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్‌లో గోల్డీ బ్రార్ కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు ఎఫ్‌బీఐ ఆరోపిస్తోంది. ఈ గ్రూప్ అమెరికా, కెనడా ప్రాంతాల్లో లక్ష్యిత హత్యలు, కాల్పులు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు.















