యూరప్ దేశాల్లో జెన్ జీ యువత మరోసారి ఆగ్రహంతో భగ్గుమంది. 25కి పైగా ఐరోపా దేశాల్లో యువత కదం తొక్కింది. మీ రాజకీయాలు పక్కన పెట్టి మా సమస్యలు పరిష్కరించండి అంటూ నినదించింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. సమస్యలు వేర్వేరుగా ఉన్నా నిరసనల విషయంలో ఏకతాటిపై నిలుస్తామంటూ నిరసన బాట పట్టారు. పెరుగుతున్న జీవన వ్యయం, గృహ అద్దెలు, నిరుద్యోగం, విద్యా రంగానికి నిధుల కొరత, ప్రభుత్వాల యుద్ధ వ్యయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినదించారు.

యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు తగిన పెట్టుబడులు పెట్టడం లేదని వారు మండిపడ్డారు. విద్యా సంస్థలకు నిధులు తగ్గించడం, పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు, ఉద్యోగావకాశాల లేమి, అందుబాటులో లేని ఇళ్ల అద్దెలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. సామాజిక సంక్షేమం, విద్యకు ఖర్చు చేయాల్సిన నిధులను ప్రభుత్వాలు రక్షణ, సైనికీకరణ, యుద్ధాలకు మళ్లిస్తున్నాయని విమర్శించారు.

తమకు యుద్ధాల కన్నా తమ భవిష్యత్ ముఖ్యమని యువత తెగేసి చెబుతున్నది. ‘మా భవిష్యత్తు కోసం పోరాడతాం.. వారి యుద్ధాల కోసం కాదు’ అనే నినాదంతో యువత ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నది. కృత్రిమ మేధ నియంత్రణ లేకుండా విస్తరించడం, దాని ప్రభావంతో ఉద్యోగాలపై ఏర్పడుతున్న అనిశ్చితి, వాతావరణ మార్పుల సంక్షోభం కూడా యువత ఆందోళనలకు కారణాలుగా ఉన్నాయి. జర్మనీలోని కొలోన్‌లో ఈఏడాది పలు యువజన సంఘాలు కలిసి అంతర్జాతీయ యువజన సమ్మెకు రూపకల్పన చేశాయి.















