అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు క్రీడలను ప్రోత్సహించడంలో ముందుంటున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది.

టాస్ఫ్ అధ్యక్షుడు వీర వట్టికూటి నాయకత్వంలో, స్పోర్ట్స్ లీడ్ షణ్ముఖ మక్కపాటి సమన్వయంతో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. టాస్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, పురుషుల పికిల్‌బాల్, మహిళల పికిల్‌బాల్, చిన్నారుల చెస్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి.

మహిళలు, చిన్నారులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు కుటుంబాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా వీర వట్టికూటి మాట్లాడుతూ తెలుగు కుటుంబాలను ఒకే వేదిక పైకి తీసుకురావడంతో పాటు భావితరాలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడమే తమ లక్ష్యమన్నారు. షణ్ముఖ మక్కపాటి ఆధ్వర్యంలో సమన్వయకర్తలు మనోజ్, మహేష్, అనుష, కామేష్, శ్వేత, కిషోర్, సంతోష్, శివ, ఆదిత్య, చందు సహకారంతో ఈ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించారు.

పీపుల్, కల్చర్, స్పోర్ట్స్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని, తెలుగు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ, తెలుగు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో టాస్ఫ్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. దీనికి సహకరించిన క్రీడాకారులు, కళాకారులు, వాలంటీర్లు, ట్రస్టీలు, స్పాన్సర్లు, తెలుగు కుటుంబాలందరికీ టాస్ఫ్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడలతో పాటు టాస్ఫ్ కల్చరల్ టీమ్ లీడ్ రవళి కోట, శిరీష మల్లుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 150 మంది కళాకారులు గానం, నృత్యం, ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. రవళి కోట నాయకత్వంలోని సాంస్కృతిక బృందం కృషిని పలువురు అభినందించారు.

ఫోర్ట్ లాడర్డేల్లో నిర్వహించిన ఈ వేడుకలకు కామ్రేడ్ కళ్యాణ్ చిత్ర దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ప్రత్యేక అతిథిగా హాజరై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విదేశాల్లో తెలుగు సంఘాలు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసిన సుబ్బారావు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టాస్ఫ్ ట్రస్టీలు నందు ధనేకుల, రావు బండారుపల్లి, అనిల్ లాకుమ్, బోస్ యలమంచి, రాంబాబు రావిపాటి పాల్గొని కార్యక్రమానికి తమ మద్దతునందించారు.















