ఆయాతి క్రియేషన్స్ పతాకంపై ఢీ అభి, నైనిక అనసురు, రాను బొంబాయికి రాను ఫేమ్ లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన పాట నువ్వు రమ్మంటే. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించడం విశేషం. సంధ్యా శ్రీధర్ కంతేటి నిర్మించిన ఈ పాటకు కుమార్. జి. దర్శకత్వం వహించగా, కల్యాణ్ కీస్ సంగీతం సమకూర్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పాట విడుదల వేడుకకు ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, రామ్ రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో గాయకుడు రామ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ పాట లాంఛ్‌కు అతిథిగా ఆహ్వానించడం సంతోషంగా ఉందని, గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్లతో వేదిక పంచుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇండిపెండెంట్ మ్యూజిక్కు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ పాట చాలా బాగుందని, కల్యాణ్ కీస్ చక్కని సంగీతం అందించారని ప్రశంసించారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ నువ్వు రమ్మంటే పాట చాలా బాగుందని, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో సృజనాత్మకత ఉంటుందని, కొత్త స్టెప్స్, కొత్త కాన్సెప్ట్‌తో పాట ఆకట్టుకుంటోందన్నారు. ఇదే పాట కమర్షియల్ సినిమాలో ఉంటే కోట్ల రూపాయలు తెచ్చిపెడుతుందని కొనియాడారు.

గణేష్ మాస్టర్ మాట్లాడుతూ తన మిత్రులు శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ లాంఛ్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత సంధ్యా శ్రీధర్ ఇచ్చిన మద్దతు వల్లే ఈ పాట సాధ్యమైందని, కల్యాణ్ కీస్ అద్భుతంగా కంపోజ్ చేశారని, అభి ఎంతో కష్టపడ్డారని, లిఖిత అడగగానే ముందుకొచ్చారని తెలిపారు. ఈ పాట ప్రేక్షకులందరికీ నచ్చాలని కోరుకున్నారు.

నటి లిఖిత మాట్లాడుతూ నువ్వు రమ్మంటే పాటలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని తెలిసిన వెంటనే అంగీకరించానని, ప్రేక్షకులు ఈ పాటను ఆదరించాలని కోరారు. హీరో ఢీ అభి మాట్లాడుతూ తనకు ఇది మొదటి ఫోక్ సాంగ్ అని, తన అభిమాన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ అతిథులుగా రావడం సంతోషంగా ఉందన్నారు.















