ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2018లో నమోదైన పరువు నష్టం కేసులో ఆయనపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనామ్ రాయిస్ ఖాన్ సోమవారం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. బీజేపీ ఐటీ సెల్ తనకు లంచం ఇవ్వజూపిందంటూ వికాస్ సంకృత్యాయన్ (వికాస్ పాండే) పేరును ప్రస్తావిస్తూ మే 2018లో రాఠీ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేయడంతో, వికాస్ పాండే వీరిద్దరిపై పరువు నష్టం దావా వేశారు.

జూలై 2019లోనే ఈ కేసులో తొలిసారి సమన్లు జారీ అయినప్పటికీ, రాఠీ ఆస్ట్రియాలో నివసిస్తుండటంతో నోటీసుల జారీ ప్రక్రియ ఏళ్ల తరబడి ఆలస్యమైంది. గురుగ్రామ్‌లోని ఆయన నివాసానికి వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్టోబర్ 17, ఆ తర్వాత అక్టోబర్ 31 తేదీల్లో కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు వచ్చారని రాఠీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపినప్పటికీ, విచారణను వేగవంతం చేయాలన్న ఫిర్యాదుదారుడి తరపు న్యాయవాది సమక్ష్ శర్మ విజ్ఞప్తి మేరకు కోర్టు తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది.

గతంలో జారీ చేసిన బెయిలబుల్ వారెంట్ల తర్వాత కూడా విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఈసారి నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. విదేశాల్లో ఉంటున్న కారణంగా సమన్లు అందడంలో జాప్యం జరుగుతోందని ఫిర్యాదుదారుడి తరపున అక్టోబర్ 12న దాఖలైన పిటిషన్‌తో ఈ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తదుపరి విచారణను ఢిల్లీ కోర్టు డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.















