Skip to main content

Namaste NRI

అట్లాంటాలో తొలిసారిగా VISTA విశాఖవాసుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం

అమెరికాలోని అట్లాంటా నగరంలో విశాఖవాసులు ఒక్కచోట చేరి తమ స్వస్థల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. VISTA (Visakhapatnam Individuals Supporting Togetherness in Atlanta) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన Visakhapatnam Meet & Greet కార్యక్రమం సంక్రాంతి రెస్టారెంట్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సుమారు 80 కుటుంబాలకు చెందిన 200 మంది చిన్నారులు, పెద్దలు హాజరై సందడి చేశారు.

కార్యక్రమానికి ప్రియ, సురేష్ కరోతు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. విశాఖ నగర చరిత్ర, వాల్తేరు, వైజాగ్, స్టీల్ సిటీ వంటి పేర్లు, పాత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, ఆర్కే బీచ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సాగిన కార్యక్రమం అందరినీ అలరించింది.

హాజరైన ప్రతి కుటుంబాన్ని పరిచయం చేస్తూ వారు విశాఖలోని ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ పాఠశాల, కళాశాలలో చదువుకున్నారు, ప్రస్తుతం అమెరికాలో ఏ రంగాల్లో స్థిరపడ్డారు అనే వివరాలను పంచుకున్నారు. ఒకే పాఠశాలలో చదువుకున్నవారు, ఒకే ప్రాంతంలో నివసించినవారు ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఆత్మీయ వాతావరణం నెలకొంది.

విశాఖ, ఉత్తరాంధ్ర చరిత్ర, సంస్కృతి, పాత సినిమా థియేటర్లు, ప్రసిద్ధ ప్రాంతాలు, మార్కెట్లపై నిర్వహించిన క్విజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, చిన్నారులు వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంక్రాంతి రెస్టారెంట్ ప్రత్యేకంగా సిద్ధం చేసిన విశాఖ ప్రాంతీయ వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్కే బీచ్ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ కాగితపు పొట్లాల్లో అందించిన మురి మిక్చర్, కోడిగుడ్డు పులుసు, పులావ్, తీపి సేమియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమానికి హాజరైన అట్లాంటాలో స్థిరపడిన పలువురు పారిశ్రామికవేత్తలు తమ జీవిత ప్రయాణం, అమెరికాలో ఎదుర్కొన్న సవాళ్లు, వ్యాపార రంగంలో సాధించిన పురోగతిని వివరించి యువతకు స్ఫూర్తినిచ్చారు.

కార్యక్రమానికి వేదికను అందించి సహకరించిన సంక్రాంతి రెస్టారెంట్ నిర్వాహకులు శ్రీ నిమ్మగడ్డ శ్రీనివాస్, శ్రీమతి కవిత నిమ్మగడ్డ దంపతులను నిర్వాహకులు సత్కరించారు. డీజే, ఆడియో విజువల్ ఏర్పాట్లకు సహకరించిన Beats & Events శ్రీధర్ (SID)ను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమ విజయవంతానికి ఉప్పు శ్రీనివాస్, సురేష్ కరోతు, నిమ్మగడ్డ శ్రీనివాస్, ఆర్. ప్రసాద్, మండపాటి వెంకటపతిరాజు, కూనపురెడ్డి ప్రసాద్ తదితరులు కీలకంగా వ్యవహరించారు.

అమెరికాలో ఉంటున్నప్పటికీ తమ స్వస్థలమైన విశాఖలో ఉన్న అనుభూతిని ఈ సమ్మేళనం కలిగించిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని కుటుంబ, సాంస్కృతిక, యువజన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

మన ఊరు విశాఖ.. మన కుటుంబం VISTA!

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events