హైదరాబాద్ లో యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ మూడు రోజుల అవగాహన పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. అంబర్‌పేట మహంకాళి ఆలయ మైదానం వేదికగా మొదలైన ఈ చైతన్య యాత్రలో సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.

2029 నాటికి దేశాన్ని సంపూర్ణ డ్రగ్స్ రహిత భారత్‌గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు మొత్తం 30 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. తొలిరోజు అంబర్‌పేట టీ జంక్షన్, విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, సీతాఫల్‌మండి, గాంధీ ఆస్పత్రి మీదుగా ముషీరాబాద్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ వరకు ఈ పాదయాత్ర సాగనుండగా, శుక్రవారం జూబ్లీహిల్స్‌లో జరిగే భారీ సభతో ముగియనుంది.

యాత్ర ప్రారంభం సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ బారిన పడి ఏ తండ్రీ తన కొడుకు భవిష్యత్తు నాశనమవడం చూడకూడదని, యువతను కాపాడుకోవడం సమాజం సమిష్టి బాధ్యత అని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగం యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నటుడు వెంకటేశ్ పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ వంటి విద్యా కేంద్రాల మీదుగా ఈ యాత్ర సాగడం ద్వారా విద్యార్థి లోకంలో బలమైన మార్పు వస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.















