2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మకాంను బెంగళూరుకు మార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏపీకి అతిథిలా వచ్చి వెళ్తున్న ఆయన, మంగళవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి రావడంతో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మకాం మార్చిన తర్వాత జగన్ ఇలా తాడేపల్లికి రావడం ఇది సరిగ్గా 100వ సారి కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగానే తన రాజకీయ వ్యవహారాలను నడిపిస్తున్న జగన్, వారానికి రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీలో పర్యటిస్తున్నారు. వైసీపీ నేతల ఇళ్లలో జరిగే వివాహాలు, పరామర్శల కోసం రాష్ట్రానికి వచ్చినప్పుడు తాడేపల్లి నివాసంలో బస చేస్తూ, అక్కడి క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహిస్తున్నారు.

గత అక్టోబర్‌లో అయితే ఆయన ఒకే రోజులో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయమే బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకుని ప్రెస్‌మీట్ నిర్వహించి, మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఆ తర్వాత సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యి, మరుసటి రోజు తెల్లవారగానే తిరిగి బెంగళూరు ఫ్లైట్ ఎక్కేశారు.















