Skip to main content

Namaste NRI

మలేషియా కౌలాలంపూర్‌లో బామ్ దీపావళి – దసరా ఉత్సవ్ వేడుకలు

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (బామ్) ఆధ్వర్యంలో బామ్ దీపావళి–దసరా ఉత్సవ్ 2026 అత్యంత వైభవంగా జరిగింది. బ్రిక్‌ఫీల్డ్స్‌ ప్రాంతంలోని కాంప్లెక్స్ టీఎల్‌కే పరిధిలో గల టానియా గ్రాండ్ హాల్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. ఈ ఉత్సవానికి కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ ప్రథమ కార్యదర్శి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 1,300 మందికి పైగా భారతీయులు పాల్గొని వేడుకను అద్భుత విజయవంతం చేశారు.

శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సైబర్‌జయలోని భక్తి గురుకులం చిన్నారులు ఆలపించిన భజనలు, మహారాష్ట్ర లెజీమ్ నృత్యం, సాంప్రదాయ మార్వాడీ నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే డ్యాన్సింగ్ దివాస్ బృందం ప్రదర్శించిన వివాహ వేడుక నృత్యరూపకం, మహిళల ఫ్యూజన్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబరిచిన కళాకారులకు బామ్ కమిటీ జ్ఞాపికలను అందజేసి సత్కరించింది.

ఈ సందర్భంగా బామ్ ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీ దాస్యం మాట్లాడుతూ ఈ ఉత్సవానికి 1,300 మందికి పైగా హాజరై విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయ కుటుంబాలు ఒకచోట చేరి మన సంస్కృతిని, పండుగలను కలిసి జరుపుకోవడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ విజయానికి కృషి చేసిన మా కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, ప్రాయోజకులు (స్పాన్సర్లు), పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ వేడుకలకు ప్రీమియం స్పాన్సర్‌గా జీఆర్‌పీసీ మలేషియా వ్యవహరించగా డీఎస్‌ఎస్ సొల్యూషన్స్, మేపుల్‌ట్రీ సొల్యూషన్స్, స్ప్రౌట్ ఎడ్యుకేషనల్ అకాడమీ, ఎరుడైట్ స్కూల్స్, ఐడియాలాజిక్ టెక్నాలజీస్, కేవీటీ జ్యువెలర్స్, ఎన్‌ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, మద్రాస్ బేకరీ సంస్థలు సహ స్పాన్సర్‌లుగా సహకరించాయి. విందు ప్రాయోజకులుగా జాబిల్లి రెస్టారెంట్, మై బిర్యానీ హౌస్, వైట్‌ఫిన్స్ మై 81, శుద్ధవిలాస్, శ్రీ రుచి రెస్టారెంట్లు వ్యవహరించాయి.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చొప్పరి సత్య, ఉపాధ్యక్షుడు భాను ముత్తినేని, ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీ దాస్యం, ట్రెజరర్ రుద్రాక్షల సునీల్ కుమార్, జాయింట్ ట్రెజరర్ గజ్జడ శ్రీకాంత్, యువజన విభాగ నాయకుడు రుద్రాక్షల రవికిరణ్ కుమార్, మహిళా సాధికారత విభాగ నాయకురాలు గీత హజారే పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు సొప్పరి నవీన్, అపర్ణ ఉగంధర్, సాయిచరణి కొండ, రహిత, సొప్పరి రాజేష్, సురేఖ, ఆశ, రామ్, భార్గవ్, సింధూర, సంధ్య పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events