ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఏఐ ట్రూత్ బాంబ్’ పేరుతో సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేశారు. ఏఐ తమ ఉద్యోగాలను దొంగిలిస్తోందని చాలామంది అరుస్తున్నారని, కానీ నిజానికి ఉద్యోగులే తమను తాము దొంగిలించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, అనలిస్టుల వరకు అంతా చాట్‌జీపీటీ, క్లాడ్, మిడ్‌జర్నీ వంటి టూల్స్‌ను రహస్యంగా వాడుతూ, ఆ పనిని తామే కష్టపడి చేసినట్లు పైఅధికారుల ముందు ప్రెజెంట్ చేస్తున్నారని వర్మ విశ్లేషించారు.

ఉద్యోగులు ఈ విషయాన్ని దాచిపెట్టినప్పటికీ.. పెరిగిన అవుట్‌పుట్, నాణ్యత, లాభాల రూపంలో కంపెనీలకు అసలు విషయం గణాంకాలతో సహా తెలిసిపోతుందని ఆర్జీవీ స్పష్టం చేశారు. 24/7 పనిచేస్తూ.. కాఫీ బ్రేక్‌లు తీసుకోకుండా, అనారోగ్యానికి గురవకుండా, కనీసం జీతం కూడా అడగకుండా పనిచేసే ఏఐతో కంపెనీలకు లాభం కలుగుతోందన్నారు. తీరా ఉద్యోగాల కోత వచ్చినప్పుడు కంపెనీలను, టెక్నాలజీని నిందిస్తున్నారని, కానీ ఉద్యోగులు రహస్యంగా తమను తాము ఎప్పుడో రీప్లేస్ చేసుకుని, తాము చేయని పనికి జీతం తీసుకుంటున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు.

భవిష్యత్తులో ఏఐ వాడకాన్ని రహస్యంగా ఉంచడం కాకుండా, ఎలాంటి అపరాధ భావన లేకుండా బాహాటంగా, దూకుడుగా ఉపయోగించడమే అసలైన నైపుణ్యం అవుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, ఏఐని ఉపయోగించే వ్యక్తులు కచ్చితంగా దానిని ఉపయోగించని వారి స్థానాన్ని భర్తీ చేస్తారన్న కఠిన వాస్తవాన్ని గ్రహించాలని ఆయన తన పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.















