Skip to main content

Namaste NRI

కేజ్రీవాల్ ఇంట్లో కళ్లు చెదిరే విలాసాలు.. చూసి షాకవుతున్న జనం!

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివసించిన అధికారిక బంగ్లాను ప్రభుత్వం శుక్రవారం సామాన్య ప్రజలు, మీడియా ప్రతినిధుల సందర్శనార్థం తెరిచింది. బీజేపీ నేతలు ‘శీష్ మహల్’గా విమర్శించే ఈ భవనం వెలుపల.. మొత్తం పునరుద్ధరణ వ్యయాన్ని రూ. 58,83,66,314గా పేర్కొంటూ ప్రభుత్వం ఒక భారీ బోర్డును ఏర్పాటు చేసింది. పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఎలా ఖర్చయిందో ప్రజలకు పారదర్శకంగా తెలియజేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భవనం లోపల అమర్చిన విలాసవంతమైన వస్తువుల ధరలను ప్రత్యేక డిస్‌ప్లేల ద్వారా అధికారులు బహిర్గతం చేశారు. ఇందులో రూ. 11 లక్షల విలువైన షాండ్లియర్లు, రూ. 10 లక్షల రౌండ్ సైడ్ టేబుళ్లు, రూ. 5,69,162 ఖరీదైన కర్టెన్లు, రూ. 5,58,885 విలువైన డైనింగ్ టేబుల్, కుర్చీలు ఉన్నాయి. వీటితో పాటు రూ. 3,34,484 విలువైన కన్సోల్ యూనిట్లు, రూ.1,96,482 ఖరీదైన డబుల్ బెడ్లు వంటి అత్యంత ఖరీదైన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రదర్శనలో ఉంచారు.

ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రులు పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కారు, బంగ్లా తీసుకోనని, కేవలం రెండు గదుల ఇల్లు చాలని చెప్పిన వ్యక్తి నివాసం కోసం ప్రారంభంలో రూ. 8 కోట్ల బడ్జెట్ అనుకుని చివరకు రూ. 58 కోట్లకు పైగా ఖర్చు చేశారని పర్వేశ్ వర్మ ఆరోపించారు. దేశం కరోనా మహమ్మారితో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో.. వియత్నాం నుంచి మార్బుల్, విదేశాల నుంచి ఆటోమేటిక్ లిఫ్టులు, ఖరీదైన క్రాకరీ తెప్పించి విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని మంత్రి కపిల్ మిశ్రా మండిపడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events