ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. దాదాపు 500 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన బ్రిటన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘బెడ్‌ఫోర్డ్ స్కూల్’ ఇప్పుడు అమరావతిలో అడుగుపెడుతోంది. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మాలక్ష్మి గ్రూప్ భాగస్వామ్యంతో తుళ్లూరు సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ తొలి అంతర్జాతీయ విద్యాసంస్థకు ఆదివారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. భారతదేశంలో బెడ్‌ఫోర్డ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్న రెండో క్యాంపస్ ఇదే కావడం విశేషం.

ఏపీసీఆర్‌డీఏ కేటాయించిన 8 ఎకరాల విస్తీర్ణంలో, రూ.100 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఈ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. తొలి దశ పనులను పూర్తి చేసి 2028 ఏప్రిల్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంబ్రిడ్జ్, ఐజీసీఎస్‌ఈ సిలబస్‌లతో 3 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఈ క్యాంపస్‌లో 1,200 నుంచి 1,500 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నారు. ఇతర నగరాల్లోని ఇంటర్నేషనల్ స్కూళ్లతో పోలిస్తే సగం ఫీజుకే ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తామని హెచ్‌ఈఏ, మాలక్ష్మి గ్రూప్ సంస్థల ఛైర్మన్ హరీష్‌చంద్ర ప్రసాద్ ప్రకటించారు. మధ్యతరగతి కుటుంబాలకు కూడా ప్రపంచస్థాయి విద్యను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ స్కూల్ ఏర్పాటుతో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.















