దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైఖరిలో మార్పు తీసుకొచ్చేందుకు INDIA కూటమి అగ్రనేతలు భారీ కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి మొత్తం 21 మంది కీలక నేతలు రెండు ప్రత్యేక విమానాల్లో చెన్నైకి బయల్దేరారు. మొదటి విమానంలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, సుధాకర్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ప్రణవ్ ఝా, మటిల్డా, ఆశుతోష్, అభయ్ కుమార్ సిన్హా, కుమారా, ఎం.ఏ. బేబీ, కపిల్ సిబల్, రాజీవ్ రాయ్ ఉన్నారు. రెండో విమానంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, వీడీ సతీశన్, కౌశల్ విద్యార్థి, ఆశుతోష్, ఈటీ మహమ్మద్ బషీర్ చెన్నైకి పయనమయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం స్టాలిన్‌తో వీరంతా అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించనున్నారు.

లోక్‌సభ స్థానాలను 850కి పెంచే డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా దేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చుకునే ప్రమాదం ఉందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఎప్పుడూ గట్టిగా నిలబడే స్టాలిన్, దేశ ప్రయోజనాలు, తమిళనాడు ప్రయోజనాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ బిల్లును వ్యతిరేకించి ఓడించేందుకు మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు కూటమి నేతల పర్యటనపై ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ, రానివ్వండి.. వచ్చి కలవనివ్వండి, కానీ అంతిమ నిర్ణయం మాత్రం మా నాయకుడు స్టాలిన్ తీసుకుంటారని స్పష్టం చేశారు.

ఈ హైవోల్టేజ్ భేటీ తమిళనాడు రాజకీయాల్లో ఇతర పార్టీలలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. దేశ ప్రయోజనాల కోసమే స్టాలిన్ ఇప్పటికే మంచి నిర్ణయం తీసుకున్నారని, ఆయన నమ్మకద్రోహులకు ఎప్పటికీ మద్దతు ఇవ్వరని తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ ప్రశంసించారు. ఇంకోవైపు, ఒకవేళ స్టాలిన్ మనసు మార్చుకుని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తికి ఒప్పుకుని మద్దతు ఇస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై తమిళనాడులో టీవీకే పార్టీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి స్టాలిన్ ఎలాంటి షరతులు విధిస్తారనే అంశంపై మంత్రులు ఆధవ్ అర్జున, ఆనంద్ తదితరులు తీవ్ర ఉత్కంఠతో చర్చిస్తున్నారు.















