నితిన్ హీరోగా, హీరో నాని సమర్పిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ అలియాస్ రుక్మిణి. ఆఫియా సయ్యద్ కథానాయిక. మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి గంటా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడారు. ఇది మా అందరికీ ప్రత్యేకమైన సినిమా. నిర్మాతగా నాకెలాంటి కన్ఫ్యూజన్ లేదు. బ్యూటిఫుల్ సినిమా ఇవ్వబోతున్నాం. ఇది చాలా అందమైన సినిమా.. మనసుకి తృప్తినిచ్చిన సినిమా. యూనివర్స్ ఈ సినిమాకు సహకరించింది. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు. చెప్పిన దానికంటే అద్భుతంగా సినిమా తీసిన దర్శకుడు మురళీకాంత్‌కు థ్యాంక్స్. నితిన్‌కి అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వబోతున్న సినిమా ఇది అని అన్నారు.

చిత్ర కథానాయకుడు నితిన్ మాట్లాడుతూ రెండుమూడేళ్లు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమా మొదలైన నాటినుంచీ నా మనసు పీస్‌ఫుల్‌గా మారింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాని దేవుడిలా ఈ కథ నా దగ్గరకు తెచ్చాడు. తనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎలాంటి సినిమా చేయాలో ఈ సినిమా నాకు నేర్పింది. టీమ్ అంతా ప్రాణం పెట్టేశారు. డిసెంబర్ 4న సినిమా చూడండి. బరాబర్ హిట్ ఇస్తున్నా అని నమ్మకంగా చెప్పారు. ఇంకా ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, వెంకట్ బోయనపల్లి, ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, శివ నిర్వాణ, శైలేష్ కొలను, రాహుల్ సంకృత్యాన్, రామ్ జగదీశ్లతోపాటు చిత్రబృందమంతా మాట్లాడారు.















