చైనాలో బర్త్ రేట్ (జననాల రేటు) గణనీయంగా తగ్గింది. 2021 లో 1000 మందికి ఆ రేటు 7.52 శాతం తగ్గినట్టు ఆ దేశ జాతీయ స్టాటిస్‌టిక్స్ బ్యూరో డేటా పేర్కొన్నది. ముగ్గురు పిల్లలు కనేందుకు ప్రభుత్వం గత ఏడాది అనుమతి ఇచ్చినా, ఆ దేశంలో బర్త్ రేటు రికార్డు స్థాయిలో పడిపోవడం శోచనీయం. ఒక జంటకు ఒకే శిశువు అన్న నియమాన్ని 2016లో చైనా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయింతే ఒక జంట ఇద్దర్ని కనవచ్చు అని డ్రాగన్ ఆ ఏడాదిలోనే ఆదేశాలు జారీ చేసింది. వృద్ధ జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సమస్యలను నుంచి బయటపడేందుకు చైనా ఆ నిర్ణయం తీసుకున్నది.
1949 నుంచి అత్యల్ప స్థాయిలో జనన రేటు నమోదు అయినట్లు ఆ దేశ గణాంకాల శాఖ వెల్లడిరచింది. చైనా జనాభా గత ఏడాది కేవలం 0.034 శాతమే పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 1960 నుంచి ఇదే అత్యల్పం అని ఆ దేశ డేటా చెబుతోంది. 2021లోనే చైనా జనాభా అత్యధిక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోందని చీఫ్ ఎకానమిస్ట్ జివీ జాంగ్ తెలిపారు. 2021లో సుమారు 10.62 మిలియన్ల జననాలు సంభవించాయి. అయితే 2020లో ఆ సంఖ్య 12 మిలియన్లుగా ఉన్నట్లు గణాంకాల శాఖ తెలిపింది. 2020లో ప్రతి వెయ్యి మందిలో 8.52 శాతం జనన రేటు ఉన్నట్లు తెలిపారు.














