తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో గొప్ప గొప్ప నటులు ఉన్నారు. అందులో నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఒకరు. సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన అనతికాలంలోనే విలక్షణ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటి వరకు దాదాపు 750కు పైగా సినిమాల్లో కైకాల నటించాడు. చివరగా కైకాల ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి సినిమాల్లో నటించారు. కాగా సోమవారం ( జూలై 25) కైకాల సత్యనారాయణ పుట్టినరోజు. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి వారి ఇంటికి స్వయంగా వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారయణ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. చిరు చొరవకు కైకాల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కైకాల సతీమణి నాగేశ్వరి, కైకాల కుమారులు లక్ష్మీనారాయణ, రామారావు ఇతరులు పాల్గొన్నారు.














