సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవం ఈ నెల 23న ఘనంగా జరిగింది. తెలుగువారి ఐక్యత, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, తెలుగువారు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉండాలనే సంకల్పంతో సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. 30 ఏళ్లుగా సమాజ సేవకులు జహీర్ బేగ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఖురాన్ పఠనం, తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ లక్ష్యాలు, సేవలను సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు నాగ శేఖర్ వివరించారు. ఏపీఎన్ ఆర్‌టీఎస్ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల బీమాపై చైర్మన్ మేడపాటి వెంకట్, కార్యవర్గ సభ్యులు పారేపల్లి వీబీ కిశోర్, వరన్రపసాద్ వివరించారు.
ఈ వేడుకల్లో భాగంగా పాటలు, నృత్యాలు, నాటికలను ప్రదర్శించారు. చిన్నారుల ప్రదర్శనలు వార్షికోత్సవానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నవారిని ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. తెలుగువారందరికీ తమ సమాఖ్య చేదోడువాదోడుగా నిలుస్తుందని కార్యదర్శి కోనేరు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. దమ్మాం కేంద్రంగా పని చేస్తున్న సౌదీ అరేబియా తెలుగు సమాఖ్యాకు అధ్యక్షులు నాగశేఖర్ చందగాని, ఉపాద్యక్షులు పారేపల్లి యన్‌వీబీ కిషోర్, ప్రధాన కార్యదర్శి పాపారావు, సంయుక్త కార్యదర్శి ఉమా మహేశ్వరారావు కోనేరు, సాంస్కృతిక ఉపాధ్యక్షుడు రామ శర్మ చివుకుల, వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ రిలేషన్స్) వర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ (ప్రభుత్వ సంబంధం) గులాం షేక్, సాంకేతిక ఉపాధ్యక్షుడు దిలీప్, కోశాధికారి హరి కృష్ణ, ఉమ్మడి కోశాధికారిగా నరసింహా రావు రాంపల్లి వ్యవహరిస్తున్నారు.














