రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ భూభాగాల రక్షణ కోసమే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నామని అవసరమనుకుంటే అణుదాడికి కూడా దిగుతామని చెప్పిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్‌లో సంభాషించారు. ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సైనిక పరిష్కారం లేదని, చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి నియామావళి, అంతర్జాతీయ చట్టం, అన్ని అన్ని దేశాల ప్రాదేశిక, సార్వభౌమత్వాన్ని గౌరవించడం ముఖ్యమని సూచించారు. అంతేకాదు, ఉక్రెయిన్ లో ఉన్న అణు కేంద్రాల భద్రత పట్ల కూడా భారత్ ఆలోచిస్తుందని, అలాంటి అణుకేంద్రాలకు ముప్పు వాటిల్లితే ప్రజలపైనా, పర్యావరణపరంగా కలిగే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని తెలిపారు. ఈ టెలిఫోన్ సంభాషణలో భారత్`ఉక్రెయిన్ ద్వైపాక్షిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.














