రష్యా` క్రిమియా ద్వీపకల్పాన్ని అనుసంధానించే కీలక వంతెనపై ఉక్రెయిన్ అనుకూల వర్గాలు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో పుతిన్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్లోని జపోరిజియా నగరంపై రష్యా భీకరదాడులకు పాల్పడిరది. క్షిపణితో దాడి చేయగా కనీసం 12 మంది మృతి చెందారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. జపోరిజియా ప్రాంతంలోని రష్యా జరిపిన దాడుల్లో ఎత్తయిన నివాస భవనం కూలిపోయింది. పలు భవనాలు దెబ్బతిన్నాయని ఉక్రేనియన్ వైమానిక దళం తెలిపింది. దాడిలో కనీసం 17 మంది మృతి చెందారని తెలిపిన సిటీ కౌన్సిల్ ఆ తర్వాత 12 మంది మాత్రమే ప్రాణాలు విడిచినట్లు పేర్కొంది. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారని, ఇందులో పది మంది వరకు పిల్లలు ఉన్నారని చెప్పింది. దాడి ఘటనలో కనీసం 20 ప్రైవేట్ ఇళ్లు, 50 అపార్ట్మెంట్ భవనాలు దెబ్బతిన్నాయని, కనీసం 40 మంది ఆసుపత్రి పాలయ్యారని సిటీ కౌన్సిల్ సెక్రెటరీ అనటోలీ కుర్తే తెలిపారు. రష్యా దాడుల పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. రష్యా అంతర్జాతీయ ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ రక్షించలేరా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.














