ప్రపంచంలోనే అత్యంత ప్రమాదక దేశాల్లో పాకిస్థాన్ ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై పాక్ అభ్యంతరం తెలిపింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోరుతూ దేశంలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్బారీ ఈ విషయాన్ని వెల్లడిరచారు. దీనిపై ప్రధాని షేహబాజ్ షరీఫ్తో చర్చించినట్లు తెలిపారు. బైడెన్ వ్యాఖ్యలతో తాను ఆశ్చర్యపోయానన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య సరైన సంప్రదింపులు లేని కారణంగా అపార్థం ఏర్పడినట్లు భావిస్తున్నానని తెలిపారు. బైడెన్ పాల్గొన్న కార్యక్రమం అధికారికమైనది కాదు. ఆయన ప్రసంగం దేశాన్ని, లేదా పార్లమెంటును ఉద్దేశించింది కాదు అని అన్నారు. ప్రస్తుత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకుగానూ అమెరికాకు అవకాశం ఇవ్వాలి. అయితే రాయబారిని పిలిపించాలనే నిర్ణయం ఆ దేశంతో సంబంధాలపై ప్రభావం చూపుతుందని భావించడం లేదు. అణ్వాయుధాల నిర్వహణ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నాం అని బిలావల్ వ్యాఖ్యానించారు.














