అమెరికా చదువులపై ఆదరణ కొనసాగుతోంది. మన దేశం నుంచి అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళుతున్న విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021-22 సంవత్సరంలో మన దేశం నుంచి ఇలా వెళ్లి అమెరికా యూనివర్శిటీల్లో చేరుతున్న వారి సంఖ్య 19 శాతం పెరిగింది. 1,99,182 మంది విద్యార్ధులు ఇలా అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్లారు. 2020-21లో 1,67,582 మంది విద్యార్ధులు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారని ఓపెన్ డోర్స్ అనే సంస్థ ఒక నివేదికలో తెలిపింది. 2012-13 సంవత్సరంలో మన దేశం నుంచి 96,654 మంది విద్యార్ధులు అమెరికా వెళ్లారు.
మన దేశం నుంచి అమెరికా వెళ్తుతున్న విద్యార్ధుల సంఖ్య 2022-23లో చైనాను మించిపోవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ జూన్-ఆగస్టు మద్యలో 82 వేల మంది మన దేశ విద్యార్ధులకు అమెరికా వీసాలు జారీ అయ్యాయి. ఈ కాలంలో ఏ దేశం కంటే ఎక్కువగా మన దేశ విద్యార్ధులే అత్యధికంగా అమెరికా వీసాలు పొందారు. గత సంవత్సరం ఇదే కాలంలో 62 వేల మంది భారతీయ విద్యార్ధులకు వీసాలు జారీ చేసినట్లు న్యూఢిల్లిలోని అమెరికా ఎంబసీ కౌన్సిలర్ వ్యవహారాల అధికారి డాన్ హాఫిన్ తెలిపారు.














