తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం , సమయస్ఫూర్తి , ధారణ ఏకకాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్య ప్రక్రియ తెలుగుభాషా వైభవానికి నిత్యసాక్ష్యం. తటవర్తి గురుకులం ద్వారా వివిధదేశాల పృచ్ఛకులతో అంతర్జాలంలో జరుగుతున్న అవధానార్చన ఇప్పటిదాకా 55 అవధానాలను ఈ సంవత్సరంలో పూర్తిచేసుకుని ,56వ అష్టావధానం ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్ నగరం వేదికగా భాషాభిమానుల నడుమ డిసెంబరు 3వ తేదీన ప్రత్యక్షంగా జరగనుంది.
ఈ కార్యక్రమానికి సంచాలకులుగా ఆస్ట్రేలియాలో ప్రముఖ పద్యకవి డాక్టర్ వేణుగోపాల్ రాజుపాలెం వ్యవహరిస్తున్నారు. పృచ్ఛకాంశాలైన సమస్యాపూరణం యామిని చతుర్వేదుల, దత్తపది మనోజ్ మోగంటి, వర్ణన అమరేందర్ అత్తాపురం, నిషిద్ధాక్షరి శ్రీనివాస్ బృందావనం, న్యస్తాక్షరి రాజశేఖర్ రావి, ఆశువు రంజిత ఓగిరాల, చిత్రానికిపద్యం అర్చన విస్సావజ్ఝుల, అప్రస్తుతం పల్లవి యలమంచిలి నిర్వహిస్తున్నారు. ఈ అవధానార్చనను ఆంధ్రప్రదేశ్ కొవ్వూరులో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అంకితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ATAI వారు సహాయం చేస్తున్నారు.














