సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఫిలిం నగర్లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కవుతవరంలో 1935 జూలై 25న ఆయన జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. 1954లో సిపాయి కూతురు సినిమాతో చలన చిత్ర రంగ ప్రవేశం చేశారు. మహేష్ బాబు మహర్షి చివరి చిత్రం. 1994లో బంగారు కుటుంబం చిత్రాన్ని నిర్మించారు. 777 చిత్రాలలో నటించారు. ఎస్వీ రంగారావు తరవాత పురాణ పాత్రలలో ఆయన మెప్పించారు. రాక్షస పాత్రలలో జీవించారు. యముడిగా ఆయన నటన అపూర్వం. కొన్నాళ్ళుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నవరస నటనా సార్వభౌమునిగా ఖ్యాతి గడించారు. విలన్ వేషాలలో దిట్ట. విలన్‌గా ఆయన నటన ప్రేక్షకులలో కోపాన్ని తెప్పించేది. ఒక నటుడిగా గుర్తింపు పొందారనడానికి ఇదే నిదర్శనం. శనివారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు..ఆయన వయసు 87సంవత్సరాలు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. హీరోగా, విలన్‌గా, కమేడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి నవరస నట సార్వభౌముడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సూపర్ హిట్ సినిమాలను రూపొందించారు.
ప్రముఖుల నివాళి
కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఓదార్చారు. ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత.. కైకాల నటన అని సీనియర్ హీరో బాలకృష్ణ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో ఆయన అభినయం ఎన్నటికీ మరువలేమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. కైకాల మృతి సినీరంగానికి తీరని లోటని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్, సత్యనారాయణ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేదని చెప్పారు. కైకాల సత్యనారాణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు. ఆయన నటించిన పాత్రలు లేవన్నారు. భావోద్వేగ పాత్రల్లో నటిస్తే కన్నీళ్లు తెప్పించేవారని గుర్తుచేసుకున్నారు. ఏనాడూ వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉండేవారని చెప్పారు. ఆయన అజాత శత్రువని కొనియాడారు. సత్యనారాయణ అకాల మరణవార్త తనను కలచివేసిందని హీరో రామ్‌చరణ్ అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమలో తాను అభిమానించే నటుల్లో ఒకరు కైకాల సత్యనారాయణ అని హీరో నాని అన్నారు. ఆయన మరణం తన హృదయాన్ని ముక్కలు చేసిందన్నారు. మన ఇంట్లో మనషిలా అందరితో కలిసిపోయేవారని చెప్పారు. సినిమాల్లో ఆయన నటన అద్భుతమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.














