యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారత ప్రవాసులకు నిజంగా ఇది గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఇకపై మనోళ్లకు వారంలోని ఏడు రోజు కూడా వీసా, పాస్పోర్ట్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఆదివారాలు కూడా ఇకపై సంబంధిత కార్యాలయాలు తెరిచే ఉంటాయని, వారంలోని మిగతా రోజుల మాదిరిగానే ఇక్కడ దరఖాస్తుల సమర్పణ, ప్రాసెస్ ఉంటుంది. దీనిలో భాగంగా పాస్పోర్ట్, వీసా సంబంధిత సేవల కోసం దరఖాస్తులు సమర్పించడానికి ఇండియన్ ఔట్సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ కేంద్రాలు ఆదివారంతో సహా వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మాట్లాడుతూ మీ శ్రేయస్సు, సంక్షేమం కోసం పని చేయడానికి మా నిబద్ధతను నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఈ క్రమంలో గత వారం నుండి పాస్పోర్ట్, వీసా సేవల కోసం అవుట్సోర్స్ సర్వీస్ ప్రొవైడర్ వారంలోని అన్ని రోజులూ పనిచేస్తోంది. అలాగే ఇకపై ఓపెన్-డోర్ విధానాన్ని నిర్వహిస్తాం. దీని ద్వారా భారతీయ జాతీయుడు అపాయింట్మెంట్ లేదా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా ఏదైనా విషయానికి సంబంధించి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి కాన్సులేట్ను సందర్శించవచ్చు అని అన్నారు.














