ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెకు తాజాగా ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎవరికీ ఉండకుండా నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె జు ఏ పేరు దేశంలోని ఏ బాలిక లేదా మహిళకు ఉండకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అలాంటి పేరు ఉన్న బాలికలు లేదా మహిళలు తమ పేరు, గుర్తింపును, బర్త్ సర్టిఫికెట్లను వెంటనే మార్చుకోవాలంటూ ఉత్తర కొరియా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జియోంగ్జు సిటీలో జు ఏ పేరుతో నమోదైన మహిళలను భద్రతా మంత్రిత్వ శాఖ పిలిపించిందని, తమ పేర్లు మార్చుకోవాలని వారికి చెప్పారు. అలాగే 12 ఏళ్ల బాలిక జు ఏ పేరును జనన ధృవీకరణ పత్రంలో మార్చాలని ఆమె తల్లిదండ్రులకు అధికారులు తెలిపారు. దీని కోసం వారం రోజుల్లో భద్రతా మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. జు ఏ పేరును ప్రస్తుతం అత్యున్నత గౌరవం ఉన్న వ్యక్తుల కోసం రిజర్వ్ చేసినట్లుగా ఉత్తర కొరియా అధికారులు పేర్కొ న్నారు.














