భారత్‌లో ఎన్రాన్ తరహా ముప్పు పొంచి ఉందని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి, హార్వర్డ్ యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ లారీ సమ్మర్స్ హెచ్చరించారు. ప్రస్తుత అదానీ గ్రూప్ సంక్షోభాన్ని ఆయన 2001లో అమెరికా ఇంధన సంస్థ ఎన్రాన్ అకౌంటింగ్ కుంభకోణంతో అన్యాపదేశంగా పోల్చారు. బ్లూంబర్గ్ వాల్‌స్ట్రీట్ వీక్ కార్యక్రమంలో సమ్మర్స్ మాట్లాడుతూ ఇండియాలో ఎన్రాన్ మాదిరి ఉదంతం చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. అదానీ గ్రూప్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తున్నదని నేను భావిస్తున్నా, జీ20 సదస్సు భారత్‌లో జరుగుతున్నది. దీంతో ప్రస్తుతం ఈ దేశం పట్ల ఎంతో ఆసక్తి నెలకొంది. ఇటువంటి ఆసక్తి కారణంగా భారత్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసే భారీ అంశాలపైనా దృష్టి పడుతుంది అని సమ్మర్స్ చెప్పుకొచ్చారు. అదానీ గ్రూప్ కార్పొరేట్ మోసాలకు పాల్పడిందంటూ యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేయడం, వాటిని అదానీ గ్రూప్ ఖండించడమూ తెలిసిందే.