Skip to main content

Namaste NRI

దేశంలోనే మొదటిసారి .. అండర్‌వాటర్‌ రోడ్ కం రైల్ టన్నెల్

దేశంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. దేశంలో మొదటిసారి అండర్‌ వాటర్ రోడ్ కం రైల్ టన్నెల్ నిర్మాణం కాబోతుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అసోంలో చేపట్టనున్న అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్ కం రైల్ టన్నెల్ ప్రాజెక్ట్‌కు రూ.18,662 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) అంగీకరించింది. త్వరలో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై గోపూర్-నుమాలిఘడ్ మధ్య ఈ ప్రాజెక్టు చేపడుతారు.

ఈ ప్రాజెక్టు ప్రధానంగా అసోం ప్రగతితోపాటు ఇతర రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడనుందని కేంద్రం తెలిపింది. రవాణా ఖర్చులు తగ్గడం, వేగవంతమవడం, సామాజిక-ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) మోడల్‌లో దీన్ని నిర్మిస్తారు. ఇది ఎన్‌హెచ్15, ఎన్‌హెచ్ 715 మధ్య 33.7 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ ప్రాజెక్టు నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లను, అలాగే రెండు ప్రధాన ఎయిర్‌పోర్టులను, రెండు జల రవాణా మార్గాలను కలుపుతుంది.

ఈ ప్రాంతాల పరిధిలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పుంజుకునేందుకు దోహదపడుతుంది. దీనిలో రెండు వేర్వేరు టన్నెల్స్ ఉంటాయి. ఒకటి రోడ్డు రవాణా కోసం. ఇంకోటి రైళ్ల కోసం. మొత్తం నాలుగు లేన్లుగా నిర్మాణం చేపడతారు. అలాగే దీని నిర్మాణం పూర్తైతే గోపూర్-నుమాలిఘడ్ మధ్య రవాణాకు దూరం 240 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంటే, ఆరు గంటల ప్రయాణానికి 20 నిమిషాలే పడుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events