భారత ప్రభుత్వం తమపై వత్తిడి తెచ్చినట్లు ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డార్సీ ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపడుతున్న సమయంలో కొందరి అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరుతూ భారత సర్కార్ తమపై వత్తిడి తెచ్చినట్లు డార్సీ పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్ బ్రేకింగ్ పాయింట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఏవైనా వత్తిళ్లు వచ్చాయా అని ప్రశ్న వేయగా ఆయన ఇండియా గురించి ప్రస్తావించారు. రైతుల నిరసన ప్రదర్శన సమయంలో తమకు ప్రభుత్వం నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని, గవర్నమెంట్ పట్ల వ్యతిరేకంగా ఉన్న జర్నలిస్టులను నియంత్రించేందుకు ప్రయత్నించారని, లేదంటే ట్విట్టర్‌ను మూసివేస్తామని బెదిరించాని వెల్లడించారు. తమ ఉద్యోగుల ఇండ్లను కూడా తనిఖీ చేశారన్నారు. ఒకవేళ తమ ఆదేశాలు పాటించకుంటే ఇండియాలో ఉన్న ఆఫీసులను మూసివేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య భారత దేశంలో ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నట్లు ఆరోపించారు. 2021లో ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి జాకీ డార్సీ తప్పుకున్నారు.


