ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త చెప్పింది. మానిటైజేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు కావాల్సిన సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. చిన్న క్రియేటర్లు సైతం మానిటైజేషన్ టూల్స్‌ను పొందేందుకు వీలుగా ఈ నిబంధనలను సవరించింది. అంటే ఇక నుంచి తక్కువ సబ్‌స్క్రైబర్స్ బేస్ కలిగిన కంటెంట్ క్రియేటర్స్ సైతం యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు.

పాత నిబంధనల ప్రకారం యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అదేవిధంగా ఏడాదిలో కనీసం 4000 గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కావాలి. మారిన మానిటైజేషన్ నిబంధనల ప్రకారం ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో 3000 గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కావాలి.కొత్త మానిటైజేషన్ నిబంధనలను మొదట అమెరికా, బ్రిటన్, కెనడా, తై వాన్, దక్షిణ కొరియాలో యూట్యూబ్ తీసుకు వస్తోంది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ దీన్ని అమలు చేయనుంది.

