సద్దుల బతుకమ్మను ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో సకుటుంబంగా జరుపుకున్నారు. లాంటౌ ద్వీపంలో క్రొత్తగా నిర్మించబడ్డ వాటర్ ఫ్రంట్ ప్రోమేనాడపై అందమైన ఆకాశంలో నక్షత్రాల మెరుపుల క్రింద, రంగు రంగుల పూలతో అందంగా తయారైన గౌరమ్మను మెరిసే పట్టు చీరలు, నగలలో అందాల భామలు, అందమైన నవ్వులతో, పిల్ల – పాపలతో ఆడపడుచులందరూ చక చక తరిలి వచ్చారు.

సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ప్రోమేనాడ చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడి పాడారు. ఇలా చాలా సేపు ఆడాక గౌరమ్మను పూజించి వెళ్ళి రావే బతుకమ్మ అంటూ సముద్రంలో నిమజ్జనం చేసారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన సత్తుపిండి (మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి, వాటిని పిండి చేసి, వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) వాయనాలను ఇచ్చి పుచ్చుకొని ప్రసాదం సేవించారు.

ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా ఆరవ సంవత్సరం జరుగుతున్న బతుకమ్మ ఉత్సవమని ఆనందంగా తెలుపుతూ, ఈ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. THKTS సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఇంత బాగా చేయగలుగుతున్నామని అన్నారు. నవంబర్లో కార్తిక వనభోజనాలు మరియు దీపావళి వేడుకల ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.














