ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో సమావేశమైంది. హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను రేవంత్ ఫాక్స్ కాన్ బృందానికి వివరించారు. 430 ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతోందన్నారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని వివరించారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.
ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. నవ తరం పరిశ్రమల అవసరాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్తులో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అందించేందుకు అవసరమైన సిలబస్ రూపకల్పనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు.