అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ లో నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధిస్తున్నారు. తద్వారా వలసలను తగ్గించొచ్చని అధ్యక్షుడు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలతో భారత్ ఆచుతూచి నిర్ణయాలు తీసుకుంటోంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. ట్రంప్ పాలనకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ యోచిస్తున్నట్లు సమాచారం.
సరైన పత్రాలు లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. అయితే, వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చని అంచనా. తాజాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్లందరినీ వెనక్కి పిలిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించబోతోందని పేర్కొన్నారు.