గూగుల్ సంస్థ ఓ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ఆ సంస్థ పూనుకున్నది . దీనిలో భాగంగా ప్రయోగశాల్లో అభివృద్ధి చేసిన సుమారు 6.4 కోట్ల బయో దోమలను అమెరికాలో రిలీజ్ చేయనున్నది. తొలుత ఈ ప్రాజెక్టును ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో చేపట్టనున్నది. దీని కోసం ప్రభుత్వం అనుమతి కోరింది గూగుల్ సంస్థ. అసలైన దోమల జనాభాను నియంత్రించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. వ్యాధికారక దోమల జనాభాను తగ్గించనున్నారు. గూగుల్ ప్లానింగ్‌కు చెందిన అంశం ప్రస్తుతం యూఎన్ పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ) ఆధీనంలో ఉన్నది.

రాబోయే రెండేళ్లలో ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో ల్యాబ్‌లో పెరిగిన మగ దోమలను వాతావరణంలోకి రిలీజ్ చేయనున్నారు. దోమల నియంత్రణ కోసం గూగుల్ సంస్థ డీబగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టును 2014లో ఆవిష్కరించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ఆ వినూత్న ప్రాజెక్టును అప్పట్లో ప్రారంభించారు. రసాయనాలు, క్రిమిసంహారకాలపై ఆధారపడకుండా. . సహజసిద్దమైన బ్యాక్టీరియా వోల్బాచియా పిపెంటిస్ ద్వారా ప్రమాదకర దోమలను అంతం చేయాలని భావిస్తున్నారు. మగ దోమలకు ఆ బ్యాక్టీరియాను ఎక్కిస్తారు. ఆ తర్వాత వాటిని అడవుల్లోకి రిలీజ్ చేస్తారు. అయితే ఆడ, మగ దోమలు కలిసిన తర్వాత వచ్చే గుడ్లు ఫలదీకరణ చెందవని గూగుల్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక పదేపదే ఈ ప్రయోగం చేపట్టడం వల్ల వ్యాధికారక దోమల జనాభాను తగ్గించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.





























