కృత్రిమ మేధస్సు(ఏఐ) మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే ఏఐ త్వరలోనే ఆందోళనకరమైన సమస్యలకు దారితీయవచ్చని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన సైబర్ దాడి ముప్పులను సృష్టించడం నుంచి జీవాయుధాలకు మూలంగా మారడం వరకు కొన్ని అత్యంత బలమైన హెచ్చరికలను జారీ చేశారు. ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు అందుకోలేనంత వేగంగా ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతున్నదని స్పష్టం చేశారు. కేవలం ఒకట్రెండు ఏండ్లలోనే ఏఐ అద్భుతమైన రీతిలో పరిణామం చెందిందని, త్వరలోనే ఇది ఆయన అభివర్ణించినట్టుగా డాటా సెంటర్‌లోని ప్రతిభావంతులైన దేశం స్థాయికి చేరుకోవచ్చని వాదించారు. అనేక రంగాల్లో మానవులను మించిపోయే అత్యంత సామర్థ్యం గల ఏఐ వ్యవస్థలను ఉద్దేశించి ఆయన ఈ హెచ్చరిక చేశారు.

ఆయన చేసిన అత్యంత తీవ్రమైన హెచ్చరికల్లో ఒకటి, అధునాతన ఏఐ వ్యవస్థలు జీవ సంబంధిత ముప్పులకు కారణం కావచ్చు. ఆర్థిక వ్యవస్థలు, కీలకమైన మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రతను ప్రభావితం చేయగల సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఏఐ మోడల్స్ సృష్టించగలవని ఇటీవలి ఆవిష్కరణలు చూపుతున్నాయని చూపారు. జీవసంబంధిత ముప్పులు త్వరలోనే రావచ్చు, తీవ్రమైన ఏఐ స్వయంప్రతిపత్తి ముప్పులు కూడా ఎంతో దూరంలో లేవని నేను నమ్ముతున్నాను అని ఆయన నొక్కి చెప్పారు.















