అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అంత సీన్ లేదు. ఆయనతో ఫొటో దిగటానికి తాను వేడుకున్నానని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను తాను కానీ, తమ దేశస్థులు కానీ ఎప్పటికీ యాచించరని స్పష్టం చేశారు. మెలోనిపై ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఒక పెద్ద దౌత్యపరమైన విభేదం తలెత్తింది. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన 52వ జీ7 శిఖరాగ్ర సమావేశంలో తనతో ఫొటో దిగడానికి ఇటలీ ప్రధాని వేడుకున్నారని ట్రంప్ ఆరోపించారు. ఆమెను చూస్తే జాలి వేసింది అని అన్నారు. దీనిపై మెలోని తీవ్రంగా స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఈ సందర్భంగా జార్జియా మెలోని మాట్లాడుతూ ట్రంప్ కల్పించిన మాటలకు నేను దిగ్భ్రాంతి చెందాను. కొన్ని విషయాలకు తక్షణ స్పందన అవసరం. ట్రంప్ ప్రకటనలు పూర్తిగా కల్పితమైనవి. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాలతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా, ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు అని అన్నారు.

అంతేకాక అమెరికా నాయకుడి దౌత్య ప్రాధాన్యతలను విమర్శిస్తూ పశ్చిమ దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఆయనకు అదే పట్టుదల లేకపోవడం సిగ్గుచేటు అని మాత్రమే నేను చెప్పగలను. పైగా, ఆయన ఇతర నాయకత్వాల పట్ల మరింత సర్దుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు అని అన్నారు. ఆమె తన ప్రసంగంలో జాతీయ గౌరవాన్ని గట్టిగా నొక్కిచెబుతూ ముగించారు ఆయన గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఇటలీ, నేను ఎన్నడూ యాచించం అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పష్టం చేశారు.





























