నైరుతి పసిఫిక్‌లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోరం విషాదం చోటు చేసుకుంది. రాజధాని పోర్ట్‌మోర్స్‌బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్‌లోని కవోకలామ్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తొలుత వందల సంఖ్యలోనే మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ సంఖ్య 2 వేలకు పైనే ఉంది.

ఈ విషయాన్ని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్, ఐరాసకు వెల్లడించింది. ఈ మేరకు లేఖ రాసింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 2,000 మందికిపైగా ప్రజలు సజీవ సమాధి అయ్యారు. వేల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. ఆహార పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటన దేశ ఆర్థిక జీవనరేఖపై పెను ప్రభావం చూపింది అని జాతీయ విపత్తు కేంద్రం ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో పేర్కొంది.
