శతాధిక చిత్రాల దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు 77వ జయంతిని పురస్కరించుకొని మే 5వ తేదీన డీఎన్‌ఆర్ ఫిల్మ్స్ అవార్డ్స్ ను ప్రదానం చేయబోతున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆయన శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహా రావు, సి.కల్యాణ్ అధ్యక్ష కార్యదర్శులుగా బి.ఎస్.ఎన్.సూర్య నారాయణ, సినీ పాత్రికేయులు ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మే 5న నిర్వహించే వేడుకలో అభినవ దర్శక రత్న, అభినయ రత్న, నిర్మాణ రత్న, పంపిణీ రత్న, ప్రదర్శనా రత్న, కథా రత్న, సంభాషణా రత్న, గీత రత్న, పాత్రికేయ రత్న, సేవా రత్న పురస్కారాలను ప్రదానం చేస్తాం అన్నారు. ఇకపై ప్రతి ఏటా ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.