రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

తొలుత గ్రామంలో రైతులతో కలిసి రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభ వేదికగా కంప్యూటర్‌పై బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈరోజు రూ. 2,200 కోట్ల నిధులను విడుదల చేయగా, ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ. 5,700 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. వచ్చే నెలలో మరో రూ.3,300 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ దేశానికి వెన్నెముక రైతులే. రైతులను ఆదుకుని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రైతు సంక్షేమమే మా విధానం” అని రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తామని కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షం పైన, బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి సవాల్ విసిరారు.

ఈ రైతు ఉత్సవాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామితో పాటు ప్రభుత్వ విప్‌లు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.















