Skip to main content

Namaste NRI

ఘనంగా ప్రారంభమైన ఆటా మహాసభలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సేవా కార్యక్రమాలు, నాయకత్వ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ప్రారంభమైన ఈ మహాసభలకు అమెరికా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రముఖులు, సామాజిక నాయకులు, రాజకీయ ప్రతినిధులు, కళాకారులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.

మహాసభల ప్రారంభ కార్యక్రమంలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ పాల్గొని ఆటా కార్యవర్గంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కీలక ప్రసంగం చేశారు. అమెరికాలో తెలుగు మూలాలున్న ఏకైక లెఫ్టినెంట్ గవర్నర్‌గా గుర్తింపు పొందిన అరుణా మిల్లర్ తన ప్రసంగంలో భావితరాల అవసరాలను అర్థం చేసుకుని నేటి తరం పెద్దలు పౌర బాధ్యతలు విస్మరించకుండా పనిచేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహాసభల నిర్వహణలో అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బాణాల, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న సతీష్ రామసహాయం రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం, యువతలో సేవా భావాన్ని పెంపొందించడం, అమెరికాలో తెలుగువారి ప్రాధాన్యం మరింత పెరిగేలా చేయడం ఈ మహాసభల ప్రధాన లక్ష్యాలని జయంత్ పేర్కొన్నారు.

అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ అయిన ఏకైక గవర్నర్‌గా మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ గుర్తింపు పొందారని, ఘజాలా హష్మీ, సుహాస్ సుబ్రహ్మణ్యం, కన్నన్ శ్రీనివాసన్, జె.జె. సింగ్ వంటి భారతీయ మూలాలున్న అమెరికన్ రాజకీయ నాయకుల సేవలను ఆమె ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని వివరించారు. ఆటా మహాసభలకు తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆటా కార్యక్రమాలను అభినందించారు.

బ్యాంక్వెట్ విందులో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రేమ్ సాగర్ రెడ్డి, పరమేష్ భీమ్ రెడ్డి, భువనేష్ బూజాల, హన్మత్ రెడ్డి తదితరులు పలువురికి అవార్డులు అందజేశారు . విద్యా, వైద్యం, క్రీడలు, సేవ, వ్యాపార, సాహిత్య, పరిశోధన రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించారు. అవార్డు అందుకున్న వారిలో కొప్పుల నరసింహ రెడ్డి, రామ్ మట్టపల్లి, గౌతమ్ అమర్నేని, కిరణ్ చుక్కపల్లి, సతీష్ కట్టుల, డా. రమ్య చిత్రాంగద, అక్షర దేవల్లి, అశోక్ చింతకుంట — మాధవి సోలేటి, వందన దేవులపల్లి, గురు సుధీర్ రావు, రవికాంత్ రెడ్డి, బాలా రెడ్డి ఇందుర్తి, హరనాథ్ పొలిచెర్ల, రవీందర్ రెడ్డి రెగట్టి, శశి గుండాల, ఎన్.ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఈషా నాగిరెడ్డి, నితీష్ సుదినిలు ఉన్నారు.

ఆటా మహాసభలకు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, వేన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు సన్నీ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొననున్నారు.

ఈ బ్యాంక్వెట్ విందులో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ ఫ్యాక్టరీ, పరంపర, ఇషితా గ్రూపుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. తెలుగు కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆరెంజ్ స్ట్రీట్ సంగీత విభావరితో శుక్రవారం వేడుక ముగిసింది. గాయని సునీత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నటుడు రాజేంద్ర ప్రసాద్, నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నిర్మాత దిల్ రాజు, శ్రీముఖి, రీతూ వర్మలు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News