విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. మైసమ్మగూడలోని నరసింహా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పెళ్లి చూపులు నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు నేను చేసిన ప్రతి సినిమా ఏదో కొత్త విషయాన్ని నేర్పించింది. ఇదొక ప్రయాణం. ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదురవుతుం టాయి. అవన్నీ దాటుకొని మనం అనుకున్నది సాధించాలి. మనకు లక్ష్యం మాత్రమే కనిపించాలి అన్నారు. వందకోట్ల కలెక్షన్స్ వచ్చే సినిమా చేయాలన్నది ఒకప్పటి నా డ్రీమ్. అది నాలుగో చిత్రం గీత గోవిందంతో నెరవేరింది. నేను చేసిన ఓ సినిమా రెండొందల కోట్లు రాబడుతుందని చెప్పాను. అలా మాట్లాడటం అహంకారం అనుకునే ప్రమాదం ఉందని చాలా మంది పెద్దలు నాతో చెప్పారు. రెండొందల కోట్ల కలెక్షన్స్ సినిమా చేస్తాననడం తప్పుకాదు. అలా చెప్పి సాధించకపోవడం తప్పు. ఎవరు ఏమనుకున్నా రెండొందల కోట్ల రూపాయల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే. అది నా మీద నాకున్న నమ్మకం. విశ్వాసం. మరొకరు సాధించగా లేనిది మనమెందుకు సాధించలేమనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నా. మీరందరూ కలలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి అన్నారు.
మన కుటుంబాల్లోని ఎమోషన్స్ అన్నీ కలబోసి తీసిన సినిమా ఇదని, అందరికి నచ్చుతుందని, విజయ్ క్యారెక్టర్‌ను దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశాడని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. కథలోని ఎమోషన్స్‌కు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని, సినిమా కోసం రాసిన ప్రతీ మాట తన గుండెల్లోంచి వచ్చిందేనని దర్శకుడు పరశురామ్ అన్నారు. ఈ సినిమాను తన ఫ్యామిలీ స్టార్ అయిన నాన్నకు అంకితమిస్తున్నానని కథానాయిక మృణాల్ ఠాకూర్ చెప్పింది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది.