అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత డిసెంబర్ 29 నాటికి దేశ రుణాలు 34 ట్రిలియన్ డాలర్లకు (రూ. 2,832 లక్షల కోట్లు) చేరాయి. ఈ లెక్కన ఒక్కో అమెరికన్ నెత్తిపై లక్ష డాలర్లు (రూ. 83 లక్షలు) అప్పు ఉన్నట్టు తేలింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తాజా నివేదికలో వెల్లడించిం ది. బడ్జెట్ లోటు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయినట్టు వివరించింది. నిజానికి అమెరికా అప్పులు 2029 సంవత్సరానికి ఈ స్థాయికి చేరుకొంటాయని అంచనా వేశారు. అయితే 2019-20లో కరోనా సృష్టించిన సంక్షోభం, అనంతరం విధించిన లాక్‌డౌన్ కారణంగా వర్తక, వాణిజ్య సముదాయాలు మూతబడి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కొవిడ్ కల్లోలం ముగియగానే ముసురుకొన్న ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, వెరసి అమెరికాను అప్పుల కుప్పగా మార్చాయి.