యూకేలో నలుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు 122 ఏండ్ల జైలుశిక్ష పడింది. ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే డ్రైవర్‌ను ప్లాన్ ప్రకారం ఫాలో చేసి దారుణంగా కొట్టి చంపినందుకుగానూ స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ తీర్పు నిచ్చింది. హత్యకు సహకరించిన నిందితుడికి కూడా పదేండ్ల జైలు శిక్ష విధించింది. పశ్చిమ ఇంగ్లాండ్ ష్రూస్ బరీలోని బెర్విక్ అవెన్యూలో గతేడాది ఆగస్టులో ఓ మర్డర్ జరిగింది. భారత సంతతికి చెందిన ఔర్మాన్ సింగ్ అనే డెలివరీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిచంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక మెర్సియా పోలీసు లు, హత్యలో ప్రమేయం ఉందని నలుగురు భారత సంతతి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ (24), జగ్‌దీప్ సింగ్ (22), శివదీప్ సింగ్ (26), మంజోత్ సింగ్ (24)లను అరెస్టు చేసి వారి నుంచి గొడ్డలి, హాకీ స్టిక్, పారను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా పథకం ప్రకారమే డెలివరీ డ్రైవర్‌ను ఈ నలుగురు దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను హత్య చేసేందుకు అతను ఎక్కడికి వెళ్తాడు. ఆరోజు ఎక్కడెక్కడ అతనికి డెలివరీలు ఉన్నాయనే విషయాన్ని సుఖ్‌మన్‌దీప్ సింగ్(23) ద్వారా తెలుసుకున్నారు. అతన్ని వెంటాడి దారుణంగా కొట్టి చంపేశారని నిర్ధారించారు. ఈ హత్య కేసుపై విచారణ జరిపిన స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ నలుగుర్ని ఇటీవల దోషులుగా గుర్తిం చింది. ఈ క్రమంలోనే నలుగురికీ యావజ్జీవ శిక్ష విధిస్తూ ఇవాళ తీర్పును వెల్లడించింది. కనీసం 28 ఏళ్ల పాటు లాకప్‌లోనే ఉంచాలని ఆదేశించింది. అలాగే హత్యకు సహకరించిన సుఖ్‌మన్ సింగ్‌కు పదేండ్ల జైలు శిక్షను విధించింది.