అగ్రరాజ్యం అమెరికాతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చడం కోసం ఇరాన్ ఓ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి, కేవలం ఏడు రోజుల్లోనే విస్తృత చర్చలను పునఃప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఈ వారంలోనే అమెరికా అధికారులకు పంపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా ఇంకా స్పందించలేదు.

కాగా ప్రపంచంలోని చమురు సరఫరాలో దాదాపు 20 నుంచి 25 శాతం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతున్నది. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత టెహ్రాన్ ఈ మార్గంలో మైన్లు పెట్టి నౌకల రాకపోకలను దాదాపుగా నిలిపివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల ఐరాస సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చర్చలకు రాకపోతే విధ్వంసం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. దీనికి బదులిచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బయటి శక్తుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి తగినంత శక్తి అవసరమని, అయితే చర్చలకు, దౌత్యానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.















