రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడేళ్లుగా సాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై ఇంకా రష్యా విరుచుకుపడుతూనే ఉన్నది. ఈ క్రమంలో రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ ప్రభుత్వం రష్యాతో యుద్ధ ఖైదీలను మార్చుకునే ప్రక్రియను పునః ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దాదాపు 1,200 మంది ఉక్రేనియన్ సైనికులను స్వదేశానికి తీసుకురావడమే లక్ష్యమన్నారు. అనేక సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయన్నారు.

టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరిగాయని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి రుస్తం ఉమెరోవ్ తెలిపారు. 2022లో ఇస్తాంబుల్‌లో ఏర్పాటు చేసిన ఖైదీల మార్పిడికి సంబంధించిన నియమాలను అమలు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. తుది సాంకేతిక, విధానపరమైన నిర్ణయాలు త్వరలో తీసుకుంటామని ఉమెరోవ్ చెప్పారు. తిరిగి వచ్చిన ఉక్రేనియన్ సైనికులు తమ కుటుంబాలతో నూతన సంవత్సరం, క్రిస్మస్ వేడుకలు జరుపుకోగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.















