గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపయ్య చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్ -5 దగ్గర పంచముఖ సంకట హర మహా గణపతిని నిమజ్జనం చేశారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఈ శోభయాత్ర కొనసాగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మార్గ్ వద్ద చేరుకున్న బడా గణేశుడికి ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు హుస్సేన్‌సాగర్ లో భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేశారు.

ఖైరతాబాద్ మహా గణేష్ చివరి దర్శనానికి, నిమజ్జన ఘట్టాన్ని కళ్లారా చేసేందుకు నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలైన ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ రహదారులు భక్తజనసందోహంతో పూర్తిగా కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు, నగర యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.















