ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం లవ్ మీ. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇఫ్ యు డేర్ ఉపశీర్షిక. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు తెరపై ఇప్పటివరకూ రానటువంటి విభిన్నమైన ప్రేమ కథాంశమిది. ఓ ఆత్మ తాలూకు ప్రేమకథగా ఉత్కంఠను పంచుతుంది. దర్శకుడు తన నిజ జీవితంలో చూసిన సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నాడు. హారర్ అంశాలతో పాటు అంతర్లీనంగా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి అని చిత్ర బృందం పేర్కొంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: పీసీ శ్రీరామ్, ఆర్ట్: అనివాష్ కొల్లా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, దర్శకత్వం: అరుణ్ భీమవరపు.