Skip to main content

Namaste NRI

అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు : సిఎం చంద్రబాబు ఆదేశం

వైఎస్‌ఆర్‌సిపి నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం(73) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడి, సిఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సంబంధిత జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముద్రగడకు అధికారిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపిగా ప్రజలకు సేవలందించడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా శ్వాస, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మరణించారు.

Social Share Spread Message

Latest News