అమెరికా చరిత్రలో తొలిసారిగా సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు జరిగే ఈ క్రతువులో ప్రతిరోజు ఉదయం మహాన్యాస పూర్వక శతరుద్ర హోమం, సాయంత్రం శతచండీ పారాయణం హోమం నిర్వహించనున్నారు. మొత్తం ఐదు రోజుల్లో 100 సార్లు చండీ పారాయణం చేయనున్నారు.

ఈ మహాయాగంలో శతచండీ, శత రుద్ర యాగాలతో పాటు దశసహస్ర మోదక, ప్రత్యంగిరా, రాజశ్యామల, వారాహీ, నక్షత్ర, అరుణ హోమాలు, దుర్గ, సరస్వతి, గాయత్రి, లక్ష్మీ దేవతలకు 10000 తామర పుషాలతో మహా కమలార్చన హోమం ప్రత్యేకంగా ఏరాటు చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు భారతదేశం నుంచి 30 మందికి పైగా రుత్వికులు పాల్గొంటున్నారు. ఈ యాగం కోసం ప్రత్యేక యాగశాల, తొమ్మిది హోమగుండాలు, భక్తుల కోసం ప్రత్యేక ఏరాట్లు, అన్నప్రసాదం, వసతి, రవాణా వంటివి ఏరాటు చేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ కమిటీల చైర్మన్లు, సభ్యులు, వందలాది మంది స్వచ్ఛంద సేవకులు రాత్రింబవళ్లు సేవలందిస్తున్నారని యాగ కమిటీ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. శివపార్వతి, వల్లీదేవసేన, సుబ్రహ్మణ్య, శ్రీనివాస, శ్రీలక్ష్మీనరసింహ, సీతారామ, రుక్మిణీకృష్ణ కళ్యాణాలను నిర్వహిస్తున్నామని కమిటీ ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్‌లు తెలిపారు. లోకకళ్యాణమే సంకల్పంగా అమెరికాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ప్రవాసులు విరివిగా పాల్గొనాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు.





























